Andhra Pradesh: మాణిక్యాలరావు అహంకారాన్ని భరించలేకపోతున్నాం!: తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ శ్రీనివాస్

  • మాణిక్యాలరావు అలానే ఆరోపిస్తుంటారు
  • స్థానిక టీడీపీ నాయకులను ఆయన పట్టించుకోరు, గౌరవించరు
  • వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారితో పెత్తనం చేయిస్తున్నారు
  • అందుకే, మా మధ్య గొడవలు : మునిసిపల్ చైర్మన్ శ్రీనివాస్

తన సొంత నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు తనను పట్టించుకోవడం లేదని, ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదంటూ రామన్నగూడెం జన్మభూమి సభలో ఏపీ మంత్రి మాణిక్యాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ శ్రీనివాస్ స్పందించారు.

‘మాణిక్యాలరావు అలానే మాట్లాడతారు. గడచిన మూడేళ్లలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. గత ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం నేను ఎంతో శ్రమించాను. ఆయన అసలు మర్యాద ఇవ్వరు, అందరినీ చులకనగా చూస్తారు. అందరినీ కలుపుకుని వెళ్లమని చాలాసార్లు చెప్పాం. ఈ విషయాన్ని మా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయినా మాణిక్యాలరావు గురించి మేమెక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిన్న కూడా ఆయన రెచ్చిపోయి మాట్లాడారు. ఈ విషయమై మేము ఖండన కూడా ఇచ్చాం. స్థానిక టీడీపీ నాయకులను ఆయన అసలు పట్టించుకోరు, గౌరవించరు. మహారాజులా ఆయన ఫీలవుతుంటారు. మున్సిపల్ కమిషనర్ ని ఉద్యోగం చేయనివ్వడు, కింది స్థాయి ఉద్యోగులను ఉద్యోగం చేయనివ్వడు..నన్ను వేధింపుల పాలు చేస్తుంటాడు.

నన్నే కాదు, ఇక్కడున్న జెడ్పీటీసీలను, మండల ప్రెసిడెంట్స్ ను...తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని పక్కనపెట్టి, వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తులతో మాపై పెత్తనం చేయిస్తున్నారు. ఇది భరించలేకనే మా మధ్య గొడవలు మొదలయ్యాయి.. అదే కొనసాగుతోంది. కులాల పేరుతో ఆయన దూషిస్తుంటారు. ఆయన అహంకారాన్ని భరించలేకపోతున్నాం’ అని ఆరోపించారు.

  • Loading...

More Telugu News