Jagan: ‘నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రిని’ అని జగన్మోహన్ రెడ్డి గారు అనట్లా?.. లీడర్లకు ఆ కాన్ఫిడెన్స్ వుంటుంది!: కోట శ్రీనివాసరావు
- అధికారంలో ఉన్నా, లేకపోయినా బీజేపీ విలువ బీజేపీదే
- పార్టీలో లీడర్లుగా ఉన్నవాళ్లకు కాన్ఫిడెన్స్ ఉంటుంది
- అందుకే, ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సోము వీర్రాజు అనేది
- ‘నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రిని’ జగన్ అనట్లా?: ఓ ఇంటర్వ్యూలో కోట
అధికారంలో ఉన్నా, లేకపోయినా బీజేపీకి విలువ, గౌరవం ఉన్నాయని బీజేపీ నేత, ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ తెలుగు రాష్ట్రాల్లో మన దౌర్భాగ్యం ఏంటంటే.. బీజేపీకి ఊతం పట్టి నడిపే నాయకులు లేరు. బీజేపీకి దాని స్థానం దానికి పదిలం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కొన్ని స్థానాలు వస్తే వస్తాయి. ఏపీ, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరచడం మాత్రం బీజేపీకి కష్టమే’ అని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయగల్గుతామంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసే వ్యాఖ్యల విషయమై కోటను ప్రశ్నించగా..‘సరే లెండి, పార్టీలో లీడర్లుగా ఉన్నవాళ్లకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు,‘నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రిని’ అని జగన్మోహన్ రెడ్డి గారు అనట్లేదా?’ అంటూ ప్రశ్నించారు.