: ఫీల్డింగ్ మాంత్రికుడి సరికొత్త అవతారం!
తన ఆక్రోబాటిక్ విన్యాసాలతో వీక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా ఫీల్డింగ్ కు సరికొత్త భాష్యం చెప్పిన తొలి క్రికెటర్ జాంటీ రోడ్స్. అప్పటి వరకు ఫీల్డింగ్ అంటే బంతి వెనక పరిగెత్తడమో, బౌండరీ చేరిన తర్వాత తీరిగ్గా బంతినందుకోవడమో అన్నట్టుగా ఉండేది. దక్షిణాఫ్రికా మెరుపు వీరుడు జాంటీ రంగ ప్రవేశం తర్వాత ఫీల్డింగ్ నిర్వచనం మారిపోయింది. డైవింగ్ క్యాచ్ లు, లిప్తపాటు త్రోలు, పాదరసంలా జర్రున జారుతూ బంతిని ఆపడాలు సర్వసాధారణమైపోయాయి.
ఫీల్డింగ్ కు ఇంతటి ప్రాచుర్యం తెచ్చిపెట్టిన జాంటీ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోచ్ గా, సలహాదారుగా పలు పాత్రలు పోషించాడు. తాజాగా భారత్ లో సర్ఫింగ్ క్రీడకు జాంటీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు. కేరళలోని కోవళం బీచ్ లో ప్రారంభమైన అంతర్జాతీయ సర్ఫింగ్ చాంపియన్ షిప్ లో జాంటీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. 20 దేశాల నుంచి 100 మంది విఖ్యాత సర్ఫర్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు.
నేడు వారితో కలిసి అరేబియా సముద్రం అలలపై జాంటీ సర్ఫింగ్ చేస్తూ ఉత్సాహంగా కనిపించాడు. భారత్ లో తొలిసారి ఈ టోర్నీ నిర్వహించడం పట్ల ఈ సఫారీ క్రికెటర్ సంతోషం వ్యక్తం చేశాడు.