Jagan: చంద్రబాబుకు కళ్లు నెత్తికెక్కాయి: జగన్
- ఏమీ చేయకుండానే ఓట్లు అడుగుతున్నారు
- నాలుగేళ్లలో ఆయన చేసిందేమీ లేదు
- నాన్న ఒకడుగు వేశారు.. నేను రెండడుగులు వేస్తా
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని... బ్రహ్మాండంగా నడిపిస్తామని ఆ పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. పుంగనూరులో ఆర్టీసీ డిపో కట్టి ఏడున్నరేళ్లు అయినా ఇంతవరకు బస్సులు ఇవ్వలేదని విమర్శించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదని... ఆయనకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని అంటున్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలు వింటుంటే ఆయనకు కళ్లు నెత్తికెక్కినట్టు అనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయకుంటే ప్రజలు సిగ్గుపడాలా? లేక ఏమీ చేయకుండానే ఓట్లు అడుగుతున్న చంద్రబాబు సిగ్గుపడాలా? అని ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కై... ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని జగన్ అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. హంద్రీనీవా నీటిని పుంగనూరుకు తీసుకొచ్చి, అన్ని చెరువులను నింపి గ్రామాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఎలాంటి ఆపరేషన్ అయినా ఉచితంగా చేయిస్తామని, వైద్య ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీలో చేరుస్తామని తెలిపారు. నాన్న వైయస్సార్ ఒకడుగు ముందుకేశారని... తాను రెండడుగులు ముందుకేస్తానని... పేదలకు అండగా నిలుస్తానని చెప్పారు.