Chandrababu: అమ్మాయిలూ కరాటే నేర్చుకోండి.. పోకిరీగాళ్ల తాట తీయండి!: చంద్రబాబు
- విద్యార్థులపై ఒత్తిడి ఉండరాదు
- విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలు తెలుసుకోవాలి
- అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్
విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 వరకు చదువు పేరుతో వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని... అది మంచిది కాదని చెప్పారు. పిల్లలపై విద్యా సంస్థలు ఒత్తిడి తీసుకురాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పిల్లలందరికీ మిడ్ డే మీల్స్ అందిస్తున్నామని చెప్పారు. అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల సహకారంతో మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు.
ఏపీని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు ఒక కమిటీని వేశామని చంద్రబాబు తెలిపారు. సిలబస్ లో మార్పులు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. విద్యా సంస్థల్లో కరాటే నేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని... ప్రతి ఒక్క అమ్మాయి కరాటే నేర్చుకోవాలని, పోకిరీగాళ్ల తాట తీయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను, ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.