YSRCP: 2017ను టీడీపీ భూ కబ్జాల సంవత్సరంగా అభివర్ణించిన వైసీపీ నేత ఆర్కే
- చంద్రబాబుపై, ఆ పార్టీ నేతలపై విమర్శలు
- రైతులను బెదిరించి భూమిని లాక్కున్న టీడీపీ నేతలు
- రికార్డులు తారుమారు చేసి అక్రమాలకు పాల్పడ్డారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆ పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్ కే) విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2017ను టీడీపీ భూ కబ్జాల సంవత్సరంగా ఆయన అభివర్ణించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో బెదిరించి వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కుని, వారిని రోడ్డుపాలు చేశారని, టీడీపీ నేతలు చాలా చోట్ల రికార్డులు తారుమారు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గడచిన మూడున్నరేళ్లలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయే తప్పా, రాజధానిలో శాశ్వత నిర్మాణమంటూ జరగలేదని విమర్శిస్తూ, ప్రతిపక్షం లేకుండా శాసనసభను నడపడంపైన కూడా ఆయన విమర్శలు గుప్పించారు.