kcr: కురుమ సంఘం అధ్యక్షుడిని ఎమ్మెల్సీగా తయారు చేస్తా.. యాదవ సోదరుడిని రాజ్యసభకు పంపిస్తా: సీఎం కేసీఆర్
- ఎగ్గె మల్లేశంను ఎమ్మెల్సీగా గెలిపించి తీరుతా
- ఒక యాదవ సోదరుడిని వచ్చే మార్చిలో రాజ్యసభకు పంపిస్తా
- సీఎం కేసీఆర్ హామీ
రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం రాజకీయాల్లోకి రావాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ అవకాశాలు రాలేదని, కచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన్ని ఎమ్మెల్సీగా తయారుచేస్తానని..గెలిపించి తీరతానని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో గొల్ల, కురుమల సంక్షేమ భవనాల సముదాయానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయంగా బీసీలకు సరైన అవకాశాలు రావాలని, వారికి న్యాయం జరగాలని అన్నారు. అందుకే, రాష్ట్రంలోని రెండు చట్టసభలకు కూడా బీసీలే నాయకులుగా ఉన్నారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ లు బీసీ వర్గానికి చెందినవారేనని అన్నారు. ఒక యాదవ సోదరుడిని వచ్చే మార్చిలో రాజ్యసభకు పంపే అవకాశం కల్పిస్తానని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు.