KCR: గొల్ల, కురుమల సంక్షేమ భవనాల సముదాయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
- కేసీఆర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేదపండితులు
- గత ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోలేదు: మంత్రి మహేందర్ రెడ్డి
- బీసీల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న కేసీఆర్: మంత్రి జోగు రామన్న
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో గొల్ల, కురుమల సంక్షేమ భవనాల సముదాయానికి సీఎం కేసీఆర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోకాపేట చేరుకున్న కేసీఆర్ కు వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి గొల్ల, కురుమలు భారీగా తరలివచ్చారు. యాదవ, కురుమ భవనాల నిర్మాణానికి 10 ఎకరాల భూమిని కేటాయించారు.
ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోలేదని, కేసీఆర్ సర్కార్ కులవృత్తులకు అండగా నిలుస్తోందని ప్రశంసించారు. గొల్ల, కురుమల్లో పేదలు ఉన్నత చదువులు చదివి అభివృద్ధిలోకి వచ్చేందుకు ఇక్కడి నుంచి కృషి జరగాలని కోరారు.
అనంతరం, మరో మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ, కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. బీసీల కోసం సీఎం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఉద్ఘాటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడున్నరేళ్ల కాలంలో అట్టడుగు వర్గాలను కేసీఆర్ గుర్తించి ఆదుకున్నారని, రాబోయే రోజుల్లో బీసీలు గౌరవంగా బతకాలన్నదే ఆయన ఆకాంక్ష అని అన్నారు.
కాగా, గొల్ల, కురుమలకు ఈరోజు పండగ రోజని, కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం సంతోషం వ్యక్తం చేశారు. గొల్ల, కురుమలంతా కేసీఆర్ వెంటే ఉంటారని అన్నారు.