Hyderabad: తెలంగాణ రైతాంగానికి కొత్త సంవత్సరం కానుక.. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి నిరంతర విద్యుత్!
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యుత్ సంస్థలు
- విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలు సక్రమంగా నడిచేలా చూడాలి
- జెన్ కో - ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు ఆదేశాలు
నూతన సంవత్సర కానుకగా తెలంగాణ రైతాంగానికి డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి ఇరవై నాలుగు గంటల విద్యుత్ ను సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను విద్యుత్ సంస్థలు పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సౌధ నుంచి జెన్ కో - ట్రాన్స్ కో సీఎండీ డి. ప్రభాకర్ రావు ఈరోజు సమీక్షించారు. ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాసరావు, ఎస్ పి డిసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్ పి డిసీఎల్ సీఎండీ గోపాలరావుతో పాటు, ఆయా సంస్థలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ, వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేయడం వల్ల పడే లోడ్ లు, ఎక్కువ లోడ్ లు వచ్చినప్పుడు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా వల్ల లోడ్ లు క్రమంగా పెరుగుతాయని, వచ్చే మార్చి నాటికి 11 వేల మెగావాట్లకు పైగా డిమాండ్ వస్తుందని, అందుకు తగ్గట్టుగా విద్యుత్ ను సమకూర్చేందుకు తగిన ఏర్పాట్లు చేశామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలు సక్రమంగా నడిచేలా చూడాలని, అన్ని స్థాయుల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. వచ్చే జూన్ నుంచి ఎత్తిపోతల పథకాల పంప్ హౌజ్ లు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, అందువల్ల లోడ్ మరింతగా పెరుగుతుందని అన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉన్నందున అందుకు తగినట్టుగా ప్రణాళిక తయారుచేసుకోవాలని ఈ సమావేశంలో ఆయన సూచించారు.