తెలంగాణ: తెలంగాణ పురపాలక శాఖకు స్కోచ్ అవార్డులు!
- తెలంగాణలో జియో ట్యాగింగ్, నల్గొండలో చేపట్టిన అధునాత సర్వే దృష్ట్యా అవార్డులు
- ఈ విధానం ద్వారా పారదర్శకత, స్పష్టమైన సమాచారం
- ఇటువంటి ప్రక్రియ దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో
తెలంగాణ పురపాలక శాఖ రెండు స్కోచ్ అవార్డులను గెలుచుకుంది. అధునాతన సాంకేతికతను ఉపయోగించి తెలంగాణలోని పట్టణాల్లో ఉన్న భవనాలకు భూ ఉపరితల ఆధారిత అనుసంధానం (జియో ట్యాగింగ్) నిర్వహించడం.. నూతన మొబైల్ టెక్నాలజీ, జియో ట్యాగింగ్ ను ఉపయోగించి ప్రయోగాత్మకంగా నల్గొండ పట్టణంలో అధునాత సర్వే ద్వారా తెలంగాణ పురపాలన శాఖ సంస్కరణలు చేబట్టడం... నేపథ్యంలో ఆ శాఖకు స్కోచ్ అవార్డులు దక్కాయి. ఈ విషయాన్ని తెలంగాణ పురపాలక శాఖ సంచాకులు డాక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
కాగా, భారత ఉపగ్రహ పరిశోధనలలో ప్రభుత్వ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ భాగస్వామ్యంతో, భారత ప్రభుత్వ ఉపగ్రహం ‘భువన్’ ఉపయోగించి, అధునాతన సాంకేతికతతో రాష్ట్రంలో ఉన్న 72 పట్టణాలలో ఉన్న 12 లక్షల భవనాలకు జియో ట్యాగింగ్ చేశారు. తద్వారా ప్రతి ఒక్క భవనాన్ని ఉపగ్రహం ద్వారా గుర్తించబడి, వారి ఆస్తి పన్ను సంఖ్యతో అనుసంధానించారు. దీని ద్వారా ప్రతి భవనం ఉన్న ప్రదేశం, దాని స్థితి మొదలైన వివరాలు తెలుసుకోవచ్చు.
ప్రతి భవనం ఫోటో, ఆస్తి పన్నుతో అనుసంధానం చేయడం వల్ల ప్రపంచంలో ఎక్కడి నుండైనా ప్రజలు భువన్ వెబ్ సాఫ్ట్ వేర్ ద్వారా చూసేందుకు వీలు కల్పించారు. అలాగే ఈ వివరాలను రిజిస్ట్రేషన్ శాఖ సహకారంతో అనుసంధానించడంతో, ఆ భవనం యొక్క పూర్వ పేరు మార్పిడిలు, అమ్మకాలు, ఇతర వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. సంబంధిత భవనం పైన ఏవైనా వివాదాలు, నిషేధాలు ఉంటే కనుక, ఆ వివరాలను పౌరులు తెలుసుకోవచ్చు. ఈ విధానం ద్వారా పారదర్శకత, సమాచారం లభిస్తుంది.
ఇటువంటి ప్రక్రియను దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర సులభ వ్యాపార విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్) లో మెరుగైన ర్యాంకు సాధించడానికి కూడా దోహదపడుతుంది. ఈ విధానం ద్వారా పారదర్శకతే కాకుండా అనుమతి లేకుండా నిర్మిస్తున్న కొత్త భవనాలు గుర్తించగలుగుతున్నారు.