అఖిలేష్ యాదవ్: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ పనిచేస్తే బీజేపీ ఓటమి తప్పదు: అఖిలేష్ యాదవ్
- వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలి
- అలా చేస్తే బీజేపీ కచ్చితంగా ఓడుతుంది
- గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీది నామమాత్రపు విజయం
- యూపీ మాజీ సీఎం అఖిలేష్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగితే బీజేపీని కచ్చితంగా ఓడిస్తుందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ, కుల, మత తత్వాన్ని రెచ్చగొట్టి ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఓట్లు రాబట్టుకుందని, అయినప్పటికీ అది నామమాత్రపు విజయమని విమర్శించారు.
అభివృద్ధి గురించి ఉపన్యాసాలు చెప్పే బీజేపీ పెద్దలు, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కులం, మతం వంటి అంశాలను ప్రచారం చేసి ఓట్లు సాధించుకున్నారని మండిపడ్డారు. గుజరాత్ ప్రజలు బీజేపీపై తమ ఆగ్రహాన్ని మరికాస్త చూపించి ఉంటే పరిస్థితులు తలకిందులయ్యేవని, గత ఎన్నికలతో పోల్చితే బీజేపీ చాలా తక్కువ స్థానాల్లో విజయం సాధించిందని విమర్శించారు. ఓబీసీ నేతలు, దళిత నేతలతో కలిసి పోరాటం కొనసాగిస్తే 2019 లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, ఆ పార్టీ కూటమి అద్భుత ఫలితాలు సాధిస్తుందని అఖిలేశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.