మెగాస్టార్ చిరంజీవి: సినీ కుటుంబం తరపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు: మెగాస్టార్ చిరంజీవి
- ఇలాంటి సభలను స్ఫూర్తిగా తీసుకోవాలి
- ‘తెలుగు’ ప్రత్యేకత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
- తెలుగు మహాసభల్లో చిరంజీవి
సినీ కుటుంబం తరపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నానని ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ‘తెలుగు’ను ఎందుకు గుర్తించాలి, గౌరవించాలి? అన్న దానితో పాటు దాని ప్రత్యేకత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు.
ఇలాంటి సభలను స్ఫూర్తిగా తీసుకోవాలని, తెలుగు భాషను ముందు తరాలకు అందించాలని కోరుకుంటున్నానన్నారు. ప్రత్యేకించి కేసీఆర్ గురించి మనం మాట్లాడుకోవాలని, ఆయన ఆలోచనలు తెలుగులో ఉండటమే కాకుండా, ‘తెలుగు’ గురించి కూడా ఆలోచిస్తున్నారనడానికి ఈ సభలే నిదర్శనమని అన్నారు. ఈ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాష తప్పనిసరిగా ఉండాలంటూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.