మంత్రి జగదీష్ రెడ్డి: విద్యుత్ ఉత్పాదనలో తెలంగాణ నెంబర్ వన్: మంత్రి జగదీశ్ రెడ్డి!
- ఆదాలోను అదే స్థాయిలో ఉందాం
- అందరికీ ఆదర్శంగా నిలిచాం
- జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సభలో మంత్రి జగదీష్ రెడ్డి
విద్యుత్ ఉత్పాదనలో యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యుత్ రంగంపై ఉన్న మక్కువే కారణమని రాష్ట్ర విద్యుత్, ఎస్.సి అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 14 నుండి 20 వరకు జరుగుతున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లేస్ రోడ్ లో ఎనర్జీ వాక్ ను ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ ఉత్పాదనలోనే కాకుండా, విద్యుత్ పొదుపు లోనూ తెలంగాణ రాష్ట్రం అదేస్థాయిలో ఉండాలని ఆకాక్షించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినప్పటికీ 25 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ ను, గృహ అవసరాలతో పాటు పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ను సరఫరా చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందని అన్నారు.
విద్యుత్ ఆదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనందరికీ ఆదర్శంగా నిలబడ్డారని కొనియాడారు. అద్భుత ఫలితాలు సాధించిన మనపై ఇప్పుడు విద్యుత్ ను అదా చేయడమన్న గురుతరబాధ్యత పడిందన్నారు. సోలార్ నుండి విద్యుత్ ఉత్పత్తికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే పర్యావరణాన్నీ కాపాడుగోగలిగిన వారమౌతామని అన్నారు. పర్యావరణానికి నష్టం కలిగిస్తున్న విద్యుత్ ప్లాంట్ లను మూసి వేస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు బొగ్గుతో అదే పనిగా విద్యుత్ ను ఉత్పత్తి చేసుకుంటూ పోతే భవిష్యత్ తరాలకు బొగ్గు నిల్వలు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి హాజరైన నగర మేయర్ బొంతు రాంమోహన్ మాట్లాడుతూ, ఇంధన ఉత్పత్తి ఖర్చు భారీగా పెరుగుతున్నందున విద్యుత్ పొదుపు మీద దృష్టి సారించాల్సిన అవసరముందని అన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో ఎల్.ఇ.డి బల్బుల వాడకం ద్వారా ఇప్పటికే 40 మెగా వాట్ల విద్యుత్ ను పొదుపు చేయగలిగామని, తద్వారా నగర పాలక సంస్థకు కోటాను కోట్ల ఆదాయం మిగులుతుందని అన్నారు.