సీఎం చంద్రబాబు: విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా విశాఖను అభివృద్ధి చేస్తా: సీఎం చంద్రబాబు
- విశాఖలో హెలీ టూరిజం ప్రారంభం
- హెలీ టూరిజం ద్వారా విశాఖ నుంచి నేరుగా అరకు వెళ్లొచ్చు
- భవిష్యత్ లో లంబసింగికి కూడా పర్యాటకులు వెళ్లే అవకాశం
- పర్యాటకంగా విశాఖ ఇంకా అభివృద్ధి చెందాలి
విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా విశాఖపట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విశాఖలో హెలీ టూరిజాన్నిఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, గోవా కంటే ఎంతో అందమైన సాగర తీరం, ఎంతో ప్రశాంతమైన వాతావరణం విశాఖ సొంతమని అన్నారు. హెలీ టూరిజం ద్వారా విశాఖ నుంచి నేరుగా అరకు వెళ్లొచ్చని, సిటీ మొత్తం చూడొచ్చని, భవిష్యత్ లో లంబసింగికి కూడా పర్యాటకులు వెళ్లే అవకాశం ఉంటుందని, హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని అన్నారు.
విశాఖలో వనరులు ఉన్నప్పటికీ, పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని, దానిని అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం శత విధాలా ప్రయత్నిస్తున్నానని చెప్పిన చంద్రబాబు, విశాఖలో గూగుల్ ఎక్స్ కంపెనీ ఏర్పాటుకు మంత్రి నారా లోకేశ్ ఒప్పందం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. విశాఖకు ‘గూగుల్’ వస్తే మరిన్ని ఐటీ సంస్థలు ఇక్కడికి వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.