రాహుల్: రాహుల్ ను చూస్తుంటే రాజీవ్ గాంధీ జ్ఞాపకమొస్తున్నారు!: ‘కాంగ్రెస్’ నేత టి.సుబ్బరామిరెడ్డి
- రాహుల్ తీరు, పద్ధతి .. రాజీవ్ గుర్తుకొస్తున్నారు
- నాటికి నేటికీ ఆయనలో ఎంతో మెచ్యూరిటీ వచ్చింది
- రాహుల్ సత్తా, తడాఖా చూసి.. మోదీ కూడా షేక్ అయ్యారు
- మీడియాతో టి.సుబ్బరామిరెడ్డి
రాహుల్ గాంధీని చూస్తుంటే ఆయన తండ్రి రాజీవ్ గాంధీ జ్ఞాపకమొస్తున్నారని ‘కాంగ్రెస్’ సీనియర్ నేత టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ, ఈరోజు రాహుల్ ప్రసంగం విన్నప్పుడు కానీ..ఇటీవల ఆయన్ని కలిసినప్పుడు గానీ ఓ విషయాన్ని గమనించాను. రాహుల్ తీరు, పద్ధతి, ఆయన చూపించే అభిమానం .. చూస్తుంటే రాజీవ్ గాంధీ గుర్తుకొస్తున్నారు. దాదాపు పదమూడేళ్ల క్రితం రాహుల్ రాజకీయాల్లోకి వచ్చారని, అప్పటికీ ఇప్పటికీ చూస్తే ఆయనలో ఎంతో మెచ్యూరిటీ వచ్చిందని అన్నారు.
రాహుల్ లో ఆప్యాయత, ఆవేశం, ఆవేదన ఉన్నాయని, ఈ పదవిని ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు వెళతారని అన్నారు. ‘మోదీ చరిష్మా ముందు రాహుల్ తట్టుకోగలరా?’ అనే ప్రశ్నకు సుబ్బరామిరెడ్డి సమాధానమిస్తూ, ‘ఎవరికైనా అవకాశం వస్తేనే వారిలో శక్తి బయటపడుతుంది. అంతకుముందు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ తన తల్లి నీడలో ఉన్నారు కనుక ఆయనలో శక్తి బయటపడలేదు. ఎంతసేపటికి, ‘తల్లినీడలో ఉన్నారు’ అనే విమర్శలు వచ్చాయి. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ సత్తా, తడాఖా చూసి.. మోదీ కూడా షేక్ అయ్యారు. ఈరోజు రాహుల్ ఉపన్యాసం ఎంత పరిపూర్ణంగా ఉందంటే.. భవిష్యత్ లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చుతాడు’ అని ధీమా వ్యక్తం చేశారు.