రాహుల్: రాహుల్ సారథ్యంలో పార్టీ మరింత ముందుకు వెళ్లాలి: సోనియాగాంధీ
- ‘కాంగ్రెస్’ అధ్యక్షురాలి హోదాలో చివరిసారి మీ ముందు మాట్లాడుతున్నా
- రాహుల్ సారథ్యంలో పార్టీ మరింత ముందుకు నడిపించాలి
- కాంగ్రెస్ నేత సోనియాగాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి అభినందనలు తెలియజేస్తున్నానని, అతని సారథ్యంలో పార్టీని మరింత ముందుకు నడిపించాలని కోరుకుంటున్నానని కాంగ్రెస్ నేత సోనియాగాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో చివరిసారి మీ ముందు మాట్లాడుతున్నానని , రాహుల్ గాంధీ సామర్థ్యంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, అతనిలో శాంతి, సహనశీలత ఎక్కువని అన్నారు. ఇరవై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తనకు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. రాజీవ్ గాంధీ పెళ్లితోనే తనకు రాజకీయాలు పరిచయమయ్యాయని, గాంధీ కుటుంబం అద్భుతమైనదని, ఇందిరాగాంధీ తనను కన్నబిడ్డగా చూసుకుందని, ఈ కుటుంబం దేశం కోసం జైళ్లకు వెళ్లిందని అన్నారు.
రాజకీయాల నుంచి తన కుటుంబాన్ని పక్కకు పెట్టాలని భావించానని, ఇందిర, తన భర్త రాజీవ్ హత్యల తర్వాత కుంగిపోయానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న సందర్భంలో కార్యకర్తల వినతి మేరకు తాను బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని నాటి విషయాలను ఆమె గుర్తుచేసుకున్నారు.