రామ్ గోపాల్ వర్మ: హే నీరజ్, పైకి వెళ్లిపోయావు.. దేవుళ్లను కూడా నవ్విస్తూ ఉండు!: రామ్ గోపాల్ వర్మ
- బాలీవుడ్ నటుడు నీరజ్ వోరా మృతి చాలా బాధాకరం
- ఎవరినైనా సరే, నవ్వించ గలిగే ఒకే ఒక వ్యక్తి ఆయన
- ‘దౌడ్’లో నీరజ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ నవ్వు ఆపుకోలేకపోయాం.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, రచయిత, దర్శక నిర్మాత నీరజ్ వోరా అనారోగ్యంతో మృతి చెందడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. నీరజ్ వోరాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నీరజ్ వోరా మృతి చెందారనే వార్త వినడం చాలా బాధాకరం. ఎవరినైనా నవ్వించ గలిగే ఒకే ఒక వ్యక్తి ఆయన. ఎవరు ఏ మూడ్ లో ఉన్నా కూడా వారిని ఆయన నవ్వించగలరు. ఆయన హాస్యచతురుడనే విషయమే తెలుసు కానీ, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనే విషయం మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ఆయనకు సంబంధించి నాకు ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన జ్ఞాపకం ‘దౌడ్’ చిత్రంలోని ఓ దృశ్యం. ఈ దృశ్యం షూట్ చేసేటప్పుడు చిత్రయూనిట్ నవ్వు ఆపుకోలేకపోవడంతో ఎన్ని టేక్స్ తీశామో! ఆయన వెళ్లిపోయారు, మనకు జరిగిన నష్టం.. స్వర్గానికి లాభం చేకూర్చిందని నేను ఊహిస్తున్నా. హే నీరజ్, పైకి వెళ్లిపోయావు, దేవుళ్లను కూడా నవ్విస్తూ ఉండు’ అని నీరజ్ పై ఉన్న తన అభిమానాన్ని వర్మ తన పోస్ట్ లో పేర్కొన్నారు.