ఎమ్మెల్సీ భూపతిరెడ్డి: ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని సస్పెండ్ చేయాలి: సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు
- ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మధ్య విభేదాలు
- మంత్రి పోచారం నివాసంలో సమావేశమైన నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు
- ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరిన ప్రజాప్రతినిధులు
నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మధ్య కొంతకాలంగా నెలకొన్న విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో భూపతిరెడ్డి వైఖరిపై సీఎం కేసీఆర్ కు నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. భూపతిరెడ్డి వైఖరిపై కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
కాగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంత్రి పోచారం నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు భూపతిరెడ్డి పాల్పడుతున్నారని, ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ టీఆర్ఎస్ ఇన్ చార్జ్ తుల ఉమ దృష్టికి కూడా ఈ విషయం తీసుకువచ్చారని సమాచారం. కాగా, ఎమ్మెల్యే బాజిరెడ్డి నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని భూపతిరెడ్డిని కేసీఆర్ గతంలో మందలించారు. అయినప్పటికీ, ఆయన వైఖరిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే భూపతిరెడ్డిపై కేసీఆర్ కు జిల్లా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు.