నన్నపనేని రాజకుమారి: ఆడపిల్లలు పూబంతులు..మగాళ్లు సీతాకోక చిలుకల్లాంటి వారు: నన్నపనేని రాజకుమారి

  • మాన, ప్రాణాలతో చెలగాటమాడే మగాళ్లపై ఎదురు తిరగాలి
  • పెడదోవ పడుతున్న యువత
  • అశ్లీల వెబ్ సైట్లు, వీడియోలను కేంద్ర ప్రభుత్వం తొలగించాలి
  • ఏపీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు నన్నపనేని

ఆడపిల్లలు పూబంతులు అయితే, మగాళ్లు సీతాకోక చిలుకల్లాంటి వారని, అలాంటి వారి ఆకర్షణకు ఆడపిల్లలు లోనవద్దని ఏపీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి సూచించారు. మహిళల్లో ఆత్మస్థయిర్యం నింపే నిమిత్తం చిత్తూరు జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుళ్లు నలుగురు గత నలభై ఐదు రోజులుగా సైకిల్ పై 1200 కిలోమీటర్లు తిరిగారు. చిత్తూరులో ఈరోజు జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా నలుగురు మహిళా కానిస్టేబుళ్లు భార్గవి, తిరుమల, నాగరత్న, నిర్మలను ఆమె అభినందించారు.

అనంతరం నన్నపనేని మాట్లాడుతూ, మహిళల మాన, ప్రాణాలతో చెలగాటమాడే మగాళ్లపై ఎదురు తిరగాలని, ఆత్మరక్షణ నిమిత్తం తప్పనిసరి పరిస్థితులలో వారిని అంతం చేయడానికి సైతం సిద్ధమవాలని అన్నారు. నేటి యువత సామాజిక మాధ్యమాలను అనవసరమైన విషయాలకు వినియోగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను, యువతను చెడుమార్గం పట్టిస్తున్న అశ్లీల వెబ్ సైట్లు, వీడియోలను కేంద్ర ప్రభుత్వం తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా విజ్ఞప్తిని అందిస్తామని చెప్పారు. కొన్ని టీవీ సీరియల్స్ లో మహిళలను చులకన చేస్తూ, అసభ్యంగా ఉండేలా, నేర ప్రవృత్తిని రెచ్చగొట్టేలా చూపిస్తున్నారని, తద్వారా మహిళలపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News