వైఎస్ జగన్: ప్రజలు నడిపిస్తున్నారు కాబట్టే, నడవగలుగుతున్నా: వైఎస్ జగన్
- పాదయాత్ర ద్వారా భిన్నమైన అనుభూతి కలుగుతోంది
- ప్రజల్లో నాపై ఆప్యాయత ఉంది
- ఆ ఆప్యాయతే నాకు ‘కిక్’ ఇస్తోంది: ఓ ఇంటర్వ్యూలో జగన్
ప్రజలు నడిపిస్తున్నారు కాబట్టే, నడవగలుగుతున్నానని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. పాదయాత్ర ప్రారంభించి నెలరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి’ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ పాదయాత్ర ద్వారా భిన్నమైన అనుభూతి కలుగుతోంది. ఇంతకు ముందు కూడా ప్రజల సమస్యలు తెలియని వ్యక్తిని కాదు. ఓదార్పు యాత్ర కూడా గొప్ప కార్యక్రమం.
ఆ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి బాగా చొచ్చుకుని పోగలిగాను. ప్రజల కష్టాలను తెలుసుకోగలిగాను. ఎవరూ వెళ్లని పూరి గుడిసెల్లోకి కూడా ఓదార్పుయాత్రను తీసుకెళ్లాం. దారి పొడవునా ఎవరు కనపడ్డా వారిని ఆపి మాట్లాడి వెళ్లే గుణం నాది. ఓదార్పు యాత్ర కూడా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలియజెప్పింది. పాదయాత్ర అనేది దానికన్నా ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఓదార్పు యాత్ర కన్నా పాదయాత్ర చాలా ప్రభావితం చూపిస్తుంది. ఈ మార్గంలో బయలుదేరి ఇక్కడ ఆగుతాననే విషయం ప్రజలందరికి తెలుస్తుంది. పాదయాత్ర చేసే మార్గం కూడా ముందుగానే అందరికీ తెలుస్తుంది.
కనుక, రోడ్డు పొడుగునా ఎవరైనా నన్ను కలిసే అవకాశం ఉంటుంది. ప్రతి సామాజిక వర్గానికి చెందిన వారు నాకు అర్జీలు సమర్పించే అవకాశం ఉంటుంది. పాదయాత్రలో నన్ను రోజు చాలా మంది కలుస్తున్నారు. వాళ్ల సమస్యలు నా దృష్టికి తీసుకువస్తున్నారు. ఉదాహరణకు, మోడల్ స్కూల్స్ లో గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్కూల్స్ ఇవి.
ఆ స్కూల్స్ లో పని చేసే టీచర్లు నా వద్దకు వచ్చి జీతాలు ఇవ్వడం లేదంటూ అర్జీలు ఇచ్చారు. ఇలాంటి సమస్యలు చెప్పే వాళ్లు శతకోటి మంది ఉన్నారు. నిజంగా ప్రజల్లో నాపై ఆప్యాయత కనబడకపోతే ఇన్ని వేల కిలోమీటర్లు నడవడం, అది కూడా పగటిపూట ఎండలో చేయడం సాధ్యం కాదు. ప్రజలు నాపై చూపిస్తున్న ఆప్యాయతే నాకు ‘కిక్’ ఇస్తోంది’ అని చెప్పుకొచ్చారు జగన్.