కిరణ్ కుమార్ రెడ్డి: టీడీపీలో చేరనున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు!
- టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్న కిశోర్ కుమార్ రెడ్డి
- బాబు సమక్షంలో ఈరోజు సాయంత్రం పార్టీలో చేరనున్న వైనం
- టీడీపీలోకి తనయుడు అమర్ నాథ్ రెడ్డి కూడా
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరునున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఈరోజు ఆయన భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం పార్టీ కండువా కప్పుకోనున్నారు. కిశోర్ కుమార్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అమర్ నాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరుతున్నట్టు సమాచారం.
కాగా, నల్లారి కుటుంబానికి చిత్తూరు జిల్లా పీలేరులో గట్టి పట్టుంది. గత మూడేళ్లుగా నల్లారి సోదరులు ఎటూ కాకుండా పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన అనంతరం సమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. కానీ, ఆ పార్టీకి ఏమాత్రం ఆదరణ లభించలేదు. కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారా? లేదా? అనే విషయం ఎటూ తేలడం లేదు. ఇలా, ఏళ్ల తరబడి ఆలోచిస్తూ కూర్చుంటే రాజకీయ భవిష్యత్ ఉండదని కిషోర్ కుమార్ రెడ్డి భావిస్తున్నారని, అందుకే, ఆయన టీడీపీలో చేరుతున్నారని తెలుస్తోంది.