దినేష్ రెడ్డి: ‘మీకు ఎందుకు అండీ ఈ ఉద్యోగం?’ అని ఎన్టీఆర్ ప్రశ్నించారు: దినేష్ రెడ్డి
- ‘ఉద్యోగం పురుష లక్షణం’ అని జవాబిచ్చా
- ‘యమగోల’ షూటింగ్ జరిగింది మా ఇంట్లోనే అని చెప్పా
- 1981లో ఎన్టీఆర్ తో నా మొదటి పరిచయం
- నాటి విషయాలను ప్రస్తావించిన దినేష్ రెడ్డి
‘ఐ డ్రీమ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా, టీడీపీ వ్యవస్థాపకుడు, నటుడు ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘1981లో ఎన్టీఆర్ విజయవాడ సందర్శించారు. ఒక హీరోను కలుసుకున్నట్టు ఉంటుందని నేను ఆయన్ని కలిసేందుకు వెళ్లాను. అదే మా మొదటి పరిచయం.
‘మీది ఏ ఊరు..?’ అని ఎన్టీఆర్ అడిగారు. ‘యమగోల’ షూటింగ్ జరిగింది మా ఇంట్లోనే, ఆ మూడంతస్తుల మిద్దె మాదే అని ఆయనకు చెప్పాను. ‘యమగోల’ షూటింగ్ అప్పుడు మా ఇంట్లో ఉన్న ఎన్టీఆర్, మా భూములన్నింటినీ చూశారు. ‘అన్ని ఆస్తులు ఉంచుకుని, మీకు ఎందుకు అండీ ఈ ఉద్యోగం?’ అని ఎన్టీఆర్ నాతో అన్నారు. ‘ఉద్యోగం పురుష లక్షణం కదా!’ అని జవాబిచ్చాను. ఈ మాటలు ఎన్టీఆర్ మైండ్ లో పడిపోయాయి.
ఎన్టీఆర్ సీఎం కాగానే, నన్ను కృష్ణాజిల్లా ఎస్పీగా నియమించమని అప్పటి డీజీపీకి చెప్పారు. అప్పుడు నేను గుంటూరులో అడిషినల్ ఎస్పీగా ఉన్నాను. కొత్తగా ఎస్పీ అయిన వారిని చిన్న జిల్లాలకు పంపిస్తారు. ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద జిల్లా, దాని తర్వాత పెద్ద జిల్లాకు ఎస్పీగా పంపించడం పద్ధతి. కానీ, నా విషయంలో అలా జరగలేదు. ఎన్టీఆర్ ప్రోద్బలంతో కృష్ణా జిల్లా ఎస్పీగా అప్పుడు నన్ను నియమించారు. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి’ అని దినేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.