ఎన్టీఆర్: రంగా, నెహ్రూలను నా హయాంలోనే అరెస్టు చేశాను!: మాజీ డీజీపీ దినేష్ రెడ్డి
- ఎన్టీఆర్ సీఎం కాగానే ‘కృష్ణా’కు నన్ను ఎస్పీగా నియమించారు
- రంగా, నెహ్రూల మధ్య రామరావణ యుద్ధం జరుగుతుండేది
- ఓ ఇంటర్వ్యూలో దినేష్ రెడ్డి
టీడీపీ మొదటి మహానాడు విజయవాడలో జరిగినప్పుడు తాను కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న విషయాన్ని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ప్రస్తావించారు. ‘ఐ డ్రీమ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అప్పుడు పదమూడు జిల్లాల ఎస్పీలు వచ్చారు. వాళ్లందరికీ నేను ఇన్ చార్జిగా వ్యవహరించాను. ఆ మహానాడు చాలా సక్సెస్ అయింది. ఎన్టీఆర్ గారికి, నాకు మంచి అవినాభావ సంబంధం ఏర్పడింది. ఎన్టీఆర్ నన్ను బాగా ఇష్టపడేవారు. ఎన్టీఆర్ సీఎం కాగానే, తన సొంత జిల్లాకు నన్ను ఎస్పీగా తీసుకున్నారు. నేను జూనియర్ మోస్ట్ ఎస్పీని. అటువంటి వాళ్లకు పెద్ద జిల్లాను ఇవ్వరు. కానీ, ఎన్టీఆర్ గారు పనికట్టుకుని మరీ, నాకు ఆ జిల్లాను ఇచ్చారు.
ఎందుకంటే, నేను ఏఎస్పీగా విజయవాడలో ఉన్నప్పుడు.. రెండు రౌడీ గ్రూప్స్ అక్కడే ఉండేవి. రంగా గ్రూప్ ఒకటి, నెహ్రూ గ్రూప్ మరోటి. ఆ గ్రూపుల్లో ఒకటి కాపు, రెండోది కమ్మ. ఆ రెండు గ్రూప్ లకు రామరావణ యుద్ధం జరుగుతుండేది. రెండు గ్రూప్ ల లీడర్లు రంగా, నెహ్రూలను నా హయాంలోనే అరెస్టు చేశాను. రంగాను హైదరాబాద్ లోని పి.జనార్దన్ రెడ్డి ఇంట్లో, నెహ్రూను వాళ్ల తోడల్లుడు (అప్పుడు ఏలూరు డీఎస్పీగా ఉన్నారు) ఇంట్లో స్వయంగా అరెస్టు చేశాము’ అని చెప్పుకొచ్చారు.