వాయుగుండం: బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తాకు వర్ష సూచన!
- వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు
- నిజాంపట్నం - విశాఖపట్నం వరకు ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక
- విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా రాగల 24 గంటల్లో కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర ఈశాన్యంగా 14 కిలోమీటర్ల వేగంతో పయనించి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయింది. దీని ప్రభావం కారణంగా వచ్చే కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, తెలంగాణలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నిజాంపట్నం నుంచి విశాఖపట్నం వరకు ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. కాగా, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు.