సీఎం చంద్రబాబు: సీఎం చంద్రబాబు, మంత్రి అఖిలప్రియ రాజీనామా చేయరే?: వైఎస్ జగన్
- ఆళ్లగడ్డలో పాదయాత్రలో జగన్ వ్యాఖ్యలు
- బోటు ప్రమాద ఘటనకు బాబు, అఖిల ప్రియ బాధ్యత వహించాలి
- ప్రతిపక్షమే లేకపోతే ప్రజలకు అండగా ఎవరుంటారనేది చంద్రబాబు ఆలోచన
విజయవాడలో ఇటీవల జరిగిన బోటు ప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అఖిల ప్రియ ఎందుకు రాజీనామా చేయరని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన పాదయాత్రలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాడు గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతి చెందిన ఘటనపై వేసిన కమిషన్ ఏమైందని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షమే లేకపోతే, ఇక ప్రజల తరపున ఎవరూ అండగా నిలబడరన్న ఆలోచనతో చంద్రబాబు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంతలో గొర్రెలను కొన్నట్టు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని, కొంతమందికి పదవులు, మరికొంతమందికి డబ్బులు ఇచ్చి ఈ విధంగా కొనుగోలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పార్టీ మారిన వాళ్లు రాజీనామా చేయకుండా, వారి పదవులు పోకుండా చంద్రబాబు కాపాడుతున్నారని జగన్ విమర్శించారు.