పరుచూరి గోపాలకృష్ణ: హృదయానికి, హృదయానికీ మధ్య వంతెన కట్టుకోండి అని చెప్పా!: పరుచూరి గోపాలకృష్ణ

  • ఆస్ట్రేలియా టూర్ విశేషాలను ప్రస్తావించిన పరుచూరి
  • సిడ్నీలో తన ప్రసంగం గురించి ప్రస్తావన
  • ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ

సినీ రంగంలో పరుచూరి బ్రదర్స్ నలభై ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారికి లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డును సిడ్నీ తెలుగు సంఘం ఇటీవల అందజేసింది. సిడ్నీలో ఈ అవార్డును పరుచూరి బ్రదర్స్ స్వీకరించారు. ఈ విషయాన్ని ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ తెలిపారు. సిడ్నీలో ఎంతమంది తెలుగు వాళ్లు ఉంటారని నిర్వాహకులను అడిగితే ముప్పై ఆరు వేల మంది అని చెప్పారు. అయితే, 'సిడ్నీ తెలుగు సంఘం'లో మొత్తం సభ్యులు మూడు వందల మంది మాత్రమే ఉండటంతో నాకు ఆశ్చర్యమేసింది.

ఆడిటోరియం వద్దకు వెళ్లేసరికి రెండొందల మంది సభ్యులు వచ్చి ఉన్నారు. అయితే, కాసేపట్లోనే ఆడిటోరియం నిండిపోయింది. అన్ని వేల మంది తెలుగువాళ్లు ఉంటే చాలా తక్కువ సంఖ్యలో సభ్యులు ఉండటం నాకు బాధేసింది. అందరూ కలుసుకోవాలని నా ప్రసంగంలో కోరుకున్నాను. ‘‘మిత్రులారా, హృదయానికి హృదయానికీ మధ్య గోడ కడితే..కలుసుకోలేం. అందుకని, హృదయానికి హృదయానికీ మధ్య వంతెన కట్టుకోండి.. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వెళ్లొచ్చు’’ అనే నా ప్రసంగానికి నిలబడి చప్పట్లు కొట్టారు’ అని చెప్పారు.

‘యువత కోసం ఏం చెప్పానంటే.. ‘మనిషికి ఎన్నో పరిమితులు ఉన్నాయి కానీ, మేథస్సుకు పరిమితి లేదు. పొట్ట గురించి మనం బాగా ఆలోచిస్తాం. పొద్దున్నే కాఫీ తాగుతాం, టిఫిన్ తింటాం. పదకొండు గంటలకు స్నాక్-టీ తీసుకుంటాం..ఒంటి గంటకు లంచ్ చేస్తాం.. మళ్లీ మూడు గంటలకు టీ-బిస్కెట్ తీసుకుంటాం. ఏడింటికో, ఏడున్నరకో డిన్నర్ చేస్తాం. ఇన్నిసార్లు పొట్ట గురించి ఆలోచిస్తున్న మనం, ఒక్కసారైనా మెదడు గురించి ఆలోచించాలి. మెదడుకి కూడా ఏరోజుకారోజు ఫీడింగ్ కావాలి. అప్పుడే, మనం ఎదుగుతాం’ అనే నా ఉపన్యాసానికి మంచి స్పందన వచ్చింది’ అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News