పోసాని కృష్ణమురళి: ‘లేదయ్యా, నువ్వు కాపుల పార్టీలో నుంచున్నావు.. నీకు ఓటెయ్యను’ అందామె!: పోసాని కృష్ణమురళి
- నాటి విషయాన్ని ప్రస్తావించిన పోసాని
- ‘కాపులు గెలిస్తే.. మనల్ని..కమ్మోళ్లని బతకనివ్వరు’ అందామె
- ‘మరి, టీ ఇస్తే తాగి వెళతా’ అని చెప్పాను
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో తాను కులం పేరు చెప్పుకుని ఓట్లు అడిగాననే విమర్శలు కరెక్టు కాదని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు.
టీవీ9 ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అప్పుడు, ఓటు వేయమని అడిగేందుకు ఓ ఇంటికి వెళ్లి.. నాకు ఓటు వేయమని ఇంటావిడను అడిగా. ఇంట్లోకి రమ్మని పిలిస్తే వెళ్లి కూర్చున్నా. కొత్తగా పోటీ చేస్తున్న నాకు ఓటెయ్యమని అడిగితే, ‘లేదయ్యా, నువ్వు కాపుల పార్టీలో నుంచున్నావు. మరి, కాపులు గెలిస్తే.. మనల్ని.. కమ్మోళ్లని బతకనివ్వరు. అందుకని, నీకు ఓటెయ్యను. నువ్వు మంచోడివి..వేరే వాళ్లకు ఓటేస్తా’ అని చెప్పింది. ‘మరి, టీ అయినా ఇస్తావా? తాగి వెళతాను?’ అని నేనంటే, ‘ఆ..ఇస్తాను’ అంటూ టీ ఇచ్చింది’ అప్పుడు జరిగింది ఈ సంఘటనే తప్పా ఇంతకు మించేమీ జరగలేదు’ అని నాటి విషయాన్ని పోసాని గుర్తుచేసుకున్నారు.