జగన్: జగన్ పద్ధతిగా ఉండే మనిషి కాదు!: సీఎం చంద్రబాబు
- జగన్ అసెంబ్లీలో ఉంటే చేసేది అల్లరే
- నా రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నా
- ప్యారడైజ్ పేపర్లలో జగన్ పేరు కారణంగా రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింది
- పాదయాత్ర చేస్తే సీఎం అవుతాననుకోవడం భ్రమ
వైసీపీ అధినేత జగన్ పద్ధతిగా ఉండే మనిషి కాదని, జగన్ అసెంబ్లీలో ఉంటే చేసేది అల్లరేనని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడమనేది వార్తేమీ కాదని, కొట్టుకుని దూషించుకుంటే వార్త అని అనుకోవడం సరికాదని అన్నారు.
తాను మాట్లాడినా, ప్రతిపక్షం మాట్లాడినా ప్రజలే న్యాయనిర్ణేతలని, తాను నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ, ఒక ప్రతిపక్షం అలిగి బయటికెళ్లడం ఇప్పుడే చూస్తున్నానని విమర్శించారు. పాదయాత్ర చేస్తే సీఎం పదవి దక్కుతుందని అనుకోవడం ఒట్టి భ్రమ అని చెప్పిన చంద్రబాబు, తన పాదయాత్ర నాటి పరిస్థితులు వేరని, అప్పుడు వైసీపీ నాయకురాలు షర్మిల కూడా పాదయాత్ర చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ప్రతిపక్షం అనేది ఉండకూడదని తాను అనడం లేదని, అభివృద్ధిని చూసి ఆశీర్వదించమని వారికి చెబుతున్నానని అన్నారు. ప్రస్తుత ప్రతిపక్షం అభివృద్ధికి అడ్డం పడుతోందని, వైఎస్ హయాంలో ప్రాజెక్టులను తాను అడ్డుకోలేదని, అవినీతిని మాత్రమే ప్రశ్నించానని నాటి విషయాన్ని బాబు ప్రస్తావించారు. ప్రతిపక్షాన్ని అదుపు చేయడం అనేది ఓ సమస్యగా తయారైందని, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధికి అడ్డుపడలేదని అన్నారు. తాను విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భాలలో కూడా రాష్ట్ర ప్రజల సమస్యల కోసం పనిచేశానని అన్నారు.
ప్యారడైజ్ పేపర్లలో జగన్ పేరు ఉండటంతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని, పాజిటివ్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంటే దానిని జగన్ చెడగొడుతున్నారని మండిపడ్డారు. జగన్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కష్టమవుతుందని అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తులను ఏ విధంగా అయితే స్వాధీనం చేసుకున్నామో, ఏసీబీ కేసుల్లో పట్టుబడ్డ వారి ఆస్తులను, చిట్ ఫండ్ మోసాలకు పాల్పడే వారి ఆస్తులను అదే విధంగా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
ఈ సందర్భంగా అనంతపురంలో టౌన్ షిప్ ఏర్పాటు విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఇక్కడ టౌన్ షిప్ ఏర్పాటు నిమిత్తం కొరియా కంపెనీ 1500 ఎకరాలు ఇవ్వమని అడిగిందని, విశాఖపట్టణంలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు లూలూ గ్రూప్ ముందుకొచ్చిందని, కొచ్చిలో ఈ గ్రూప్ నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ ను చూసేందుకు రేపు అక్కడికి వెళ్లనున్నట్టు చెప్పారు. భూ సేకరణ చట్ట ప్రకారం భూమి తీసుకుని విశాఖలో నిర్మించనున్న కన్వెన్షన్ సెంటర్ కు అప్పగిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.