తమ్మారెడ్డి: సినీ రంగానికి చెందిన వారి భార్యల గురించి ఆ ఎంపీ అలా మాట్లాడతాడా?: నిప్పులు చెరిగిన తమ్మారెడ్డి భరద్వాజ
- బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయపై మండిపడ్డ భరద్వాజ
- ‘సినిమా తీసే వాళ్ల కుటుంబాల్లో మహిళలు ప్రతిరోజూ భర్తలను మార్చేస్తుంటారని ఆయన అనడం తప్పు
- ఎంపీ అయినంత మాత్రాన ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు
- సినిమా ఇండస్ట్రీ అంతా ఏకమైతే ఏమవుతుందో మీకు తెలియదు! ఖబడ్దార్
వివాదాస్పద చిత్రం ‘పద్మావతి’ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీని దుయ్యబడుతూ మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై సినీ రంగ ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 'సినిమా తీసే వాళ్ల కుటుంబాల్లో మహిళలు ప్రతిరోజూ భర్తలను మార్చేస్తుంటారు. దుష్ట మనస్తత్వాలతో నన్ను చికాకు పెట్టే దర్శకులను చెప్పుతో కొడతాను..’ అంటూ చింతామణి మాలవీయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆయనపై నిప్పులు చెరిగారు. తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆయన మాట్లాడారు. "ఇక్కడ నాకు అర్థం కానిది ఒకటే.. సినిమా రంగానికి చెందిన ఫలానా వ్యక్తిపై ఆయనకు కోపం వస్తే ఆయన్నే తిట్టాలి. అంతేగానీ, సినిమా వాళ్ల కుటుంబాల్లో ఉన్న మహిళలందరినీ ఇంతగా కించపరుస్తూ మాట్లాడటం చాలా బాధగా ఉంది’ అంటూ భరద్వాజ ఆవేదన వ్యక్తం చేశారు.
‘దేశంలో విడాకులు తీసుకోవడం మామూలు అయిపోయింది. కొత్త భర్తలు, కొత్త భార్యలు వస్తున్నారు. ఇప్పుడున్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలలో కొందరు సెకండ్, థర్డ్ పెళ్లిళ్లు చేసుకోలేదా? వాళ్ల పేర్లు చెప్పి వాళ్లను కించపరచడం నాకు ఇష్టం లేదు. నాకు సంస్కారం ఉంది. సినిమా వాళ్ల పెళ్లాలు ఎవరితోనో వెళ్లి పోతారని వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. ఈ వ్యాఖ్యలను ఖండించకుండా ఊరుకోవడం చాలా కష్టం.
‘దుష్ట మనస్తత్వాలతో నన్ను చికాకు పెట్టే దర్శకులను చెప్పుతో కొడతాను’ అని కూడా చింతామణి మాలవీయ వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి వస్తే, మేము కూడా చెప్పు తీసుకుని కొట్టే పరిస్థితి వస్తుంది. ఏం, సినిమా వాళ్ల పెళ్లాలు అంత తేరగా దొరికిరా, ఈ వ్యాఖ్యలు చేయడానికి? అతను ఏమనుకుంటున్నాడు? అతని ఉద్దేశ్యం ఏమిటి? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా వీళ్లు! ఎంపీలు అయినంత మాత్రాన నోటికొచ్చిన మాటలు మాట్లాడే అధికారం లేదు.
నా మీద కోపం వస్తే నన్ను తిట్టాలి. అంతేగానీ, మొత్తం సినీ రంగానికి చెందిన వారి భార్యల గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? చేతుల్లో ప్రభుత్వం ఉంది కదా, ఏది పడితే అది చేయొచ్చనుకుంటున్నారా? కరెక్టు కాదు. సినిమా ఇండస్ట్రీ అంతా ఏకమైతే ఏమవుతుందో మీకు తెలియదు! ఖబడ్దార్’ అంటూ తమ్మారెడ్డి భరద్వాజ హెచ్చరించారు.