దాసోర్ శ్రవణ్: రాజకీయాల్లో పవన్ కల్యాణ్ విజయవంతం కావాలని ఆశిస్తున్నా: కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్
- పవన్ కల్యాణ్ లో ప్రజలకు సేవ చేయాలనే తపన పోలేదు
- తనను, తన కెరీర్ ని కాపాడుకుంటూనే పార్టీని పవన్ రక్షించుకోవాలి
- ఓ ఇంటర్వ్యూలో దాసోజు శ్రవణ్
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి, నాటి ప్రజారాజ్యం నాయకుడు దాసోజు శ్రవణ్ అన్నారు. యూట్యూబ్ ఛానెల్ ‘తెలుగు పాపులర్ డాట్ కామ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నాడు ప్రజారాజ్యం పార్టీ లాంచింగ్ కార్యక్రమం తిరుపతిలో జరిగింది. అప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కళారూపాల ప్రదర్శన ఎలా చేయాలనే డెమానిస్ట్రేషన్ మా టీవీలో చూపించాం. అప్పుడు, చిరంజీవి గారు చూసి బాగా మెచ్చుకున్నారు.
ఈ వ్యవహారాలన్నింటిని పవన్ కల్యాణ్ గారు చూసేవారు. ఆయనకు నేను సహాయపడుతుండే వాడిని. ఓ ఎనిమిది నెలల పాటు ఉద్యోగం వదిలిపెట్టి వచ్చేయమని పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో నాతో అన్నారు. ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి వచ్చేశా... నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం పవన్ కల్యాణ్ గారే. నాడు ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్ లో ఇప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే తపన పోలేదు. పవన్ కల్యాణ్ తనను, తన కెరీర్ ని కాపాడుకుంటూనే పార్టీని రక్షించుకోవాలి. రాజకీయాల్లో పవన్ విజయవంతమవుతారని.. విజయవంతం కావాలని ఆశిస్తున్నా’ అని శ్రవణ్ కుమార్ అన్నారు.