India: పాకిస్థాన్ సైన్యానికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనేందుకు సాక్ష్యం ఇదే!: ఆర్మీ అధికారులు
- కశ్మీర్ లోని పుల్వామా జిల్లా అగ్లర్ ప్రాంతం కందీ బెల్ట్ లో ఉగ్రవాదుల ఎన్ కౌంటర్
- ఒక ఉగ్రవాది వద్ద అమెరికాలో తయారై, నాటో దళాలకు చెందిన అత్యాధునిక ఎం4 కార్బైన్ ఆయుధం
- ఎం4 కార్బైన్ తుపాకిని మసూద్ అజర్ మేనల్లుడికి ఇచ్చిన పాక్ ఆర్మీ
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్థాన్ ఆర్మీ అన్న విషయం పలు సందర్భాల్లో బయటపడిన సంగతి తెలిసిందే. దీనిని నిర్ధారించే ఘటనలు పలు చోటుచేసుకోగా, తాజాగా కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాదులతో పాక్ సైన్యానికి గల సంబంధాలు బట్టబయలు చేసే సాక్ష్యం ఒకటి లభ్యమైంది. పుల్వామా జిల్లా అగ్లర్ ప్రాంతం కందీ బెల్ట్ లో మొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే.
అనంతరం అక్కడ జరిపిన తనిఖీల్లో ఒక ఉగ్రవాది నుంచి ఎం4 కార్బైన్ ఉందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇది అమెరికాలో తయారైన ఆయుధమని వారు వెల్లడించారు. దీనిని నాటో దళాలు వినియోగిస్తాయని వారు చెప్పారు. పాక్ సైన్యానికి చెందిన ప్రత్యేక దళం ఈ ఆయుధాన్ని వినియోగిస్తోందని వారు చెప్పారు. ఈ ఆయుధం పాక్ సైన్యం వద్ద ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు, ఫోటోలు హల్ చల్ చేశాయని వారు గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో ఆ ఆయుధాన్ని అతనికి పాక్ సైన్యమే అందించిందని వారు ఆరోపించారు. ఎన్ కౌంటర్ కు గురైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడు పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ మేనల్లుడు అన్న సంగతి తెలిసిందే.