బీజేపీ: బీజేపీలో చేరిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు
- కంభంపాటి హరిబాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన సీకే బాబు
- మూడేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరం
- ఇటీవల అమిత్ షాను కలిసిన సీకే బాబు
మూడేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిత్తూరు జిల్లా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఈరోజు ఆయన ‘కమలం’ గూటికి చేరారు. సీకే బాబుతో పాటు ఆయన అనుచరులు కూడా బీజేపీ సభ్యత్వం స్వీకరించారు.
అనంతరం, సీకే బాబు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పని తీరు చూసి స్ఫూర్తి పొందానని అన్నారు. పేదల సంక్షేమం కోసం ఆయన పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని, మోదీ సారథ్యంలో భారత్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాగా, చిత్తూరు ఎమ్మెల్యేగా ఆయన ఇరవై ఏళ్లు సేవలందించారు. ఈ నెల 2న బెంగళూరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఆయన కలిశారు.