సూపర్ స్టార్ కృష్ణ: ఒక్క డైలాగు విని, మాకు ఎనిమిది సినిమాలకు రాసే అవకాశాన్ని కృష్ణగారు ఇచ్చారు!: పరుచూరి గోపాలకృష్ణ

  • ‘బంగారుభూమి’లో ఆ డైలాగు కృష్ణగారికి తెగ నచ్చేసింది 
  • సినీ పరిశ్రమలో మాకు చేయూత నిచ్చిన ఆయన్ని మరువలేం
  • ‘పరుచూరి పలుకులు’లో మాటల రచయిత గోపాలకృష్ణ

సూపర్ స్టార్ కృష్ణను తమ జన్మలో మరువలేమని, సినీ రంగంలో తమకు చేయూత నిచ్చిన మహానుభావుడు ఆయనని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పలుకులు’లో నటశేఖర కృష్ణతో తమకు ఉన్న అనుబంధాన్ని, తమను ఆయన  ప్రోత్సహించిన విషయాన్ని ఈ సందర్భంగా గోపాలకృష్ణ ప్రస్తావించారు.

‘1980లలో కృష్ణ గారు నటించిన ‘పగబట్టిన సింహం’, ‘బంగారుభూమి’ చిత్రాలకు ఘోస్ట్ రైటర్ గా పనిచేశా. ‘బంగారుభూమి’లో కృష్ణ, శ్రీదేవి నటించిన ఓ సన్నివేశానికి నేను డైలాగ్ రాశాను. ‘పద్మా, మనిషిని నమ్మితే మన నోట్లో ఇంత మట్టి కొడతాడు. అదే, మట్టిని నమ్మితే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది. ఆ మట్టికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టు’ అనేది ఆ డైలాగ్. షూటింగ్ స్పాట్ లో సీన్ ఇవ్వగానే చూసిన కృష్ణగారు ఈ డైలాగ్ ఎవరు రాశారని ప్రశ్నిస్తే, చిత్ర యూనిట్ చెప్పలేదట. ఈ డైలాగ్ ఎవరు రాశారో చెప్పమని కృష్ణ గారు మళ్లీ అడగడంతో ‘ఉయ్యూరు లెక్చరర్’ అని వారు చెప్పారని’ గోపాలృష్ణ అన్నారు.
 
‘ఇతను చాలా లోతుగా వెళ్లి ఆలోచించాడని’ మెచ్చుకున్నారట. ఆ తర్వాత ఎనిమిది సినిమాలకు మాటలు రాసే అవకాశాన్ని ఆ మహానుభావుడు మాకు కల్పించాడు. అన్న ఎన్టీఆర్ గారు మాకు పరుచూరి బ్రదర్స్ అని పేరుపెట్టి ఆశీర్వదిస్తే, మాకు చేయూత నిచ్చి ఆశీర్వదించింది కృష్ణ గారు. ఆయన్ని ఈ జన్మలో మర్చిపోలేం’ అని గోపాలకృష్ణ అన్నారు.

  • Loading...

More Telugu News