కేసీఆర్: భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతంగా కొనసాగుతోంది: సీఎం కేసీఆర్
- తెలంగాణ అసెంబ్లీలో భూ రికార్డుల ప్రక్షాళన అంశంపై చర్చ
- వంద శాతం పారదర్శకతతో జరుగుతోంది
- లక్ష్మాపూర్ గ్రామానికి రెవెన్యూ మ్యాప్ కూడా లేదు: సీఎం కేసీఆర్
తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, త్వరలోనే ఈ కార్యక్రమానికి ముగింపు పలకబోతున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ రికార్డుల ప్రక్షాళన చేయాలనే నిర్ణయం ఉన్నపళంగా తీసుకున్నది కాదని, సంబంధిత అధికారులతో పలు సమావేశాలు నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
వంద శాతం పారదర్శకతతో, రెండు భాగాలుగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోందని అందులో ఒకటి.. భూములకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు, ఫారెస్ట్ , కోర్టు పరిధిలో ఉన్న భూముల జోలికి పోవద్దని, రెండోది.. కుటుంబసభ్యుల మధ్య భూ వివాదాలు ఉండే వాటి వద్దకు అధికారులు వెళ్లవద్దని సూచించామని చెప్పారు. గ్రామస్తులందరికీ ఆమోదయోగ్యంగా ఉండే భూములను ప్రక్షాళన చేయమని, మొదటగా గ్రామీణ ప్రాంత రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయాలని సూచించామని కేసీఆర్ పేర్కొన్నారు.
భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సెప్టెంబర్ 15న ప్రారంభమైందని, వచ్చే నెల 31తో ముగుస్తుందని చెప్పారు. ఇప్పటివరకు అరవై శాతం రికార్డుల ప్రక్షాళన జరిగిందని, ఇంకా నలభై శాతం మిగిలి ఉందని అన్నారు. భూముల వివరాలు, రికార్డుల గురించి రైతులు పడే కష్టాలకు కారణం గత ప్రభుత్వాలేనని, నాడు నిర్లక్ష్యంగా ప్రవర్తించినందువల్లే ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో ఒక్కో గ్రామంలో భూముల లెక్కలకు, కొలతలకు సంబంధించి ఎక్కడా పొంతన లేదని, శామీర్ పేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి రెవెన్యూ మ్యాపు కూడా లేదని అన్నారు.