YSRCP: వైసీపీకి మరో షాక్.. కాపు నేత కిలారి రోశయ్య గుడ్ బై?
- పార్టీ వీడేందుకు సిద్ధమైన రోశయ్య
- పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని మనస్తాపం
- అనుచరులతో సమావేశంలో వాపోయిన నేత
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టిన తొలి రోజే ఆయనకు షాకులు మీద షాకులు తగిలాయి. ప్రజాసంకల్ప యాత్ర తొలి అడుగైనా పడకముందే ‘ప్యారడైజ్ పేపర్స్’ కుంభకోణంలో ఆయన పేరు బయటపడడంతో కలకలం రేగింది. పాదయాత్ర మొదలయ్యాక పార్టీ కార్యకర్త ఒకరు గుండెపోటుతో మృతి చెందాడు. ఇప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ కాపు నేత కిలారి రోశయ్య పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.
పార్టీ నేతలు, అనుచరులతో కలిసి ఓ హోటల్లో సమావేశమైన ఆయన పార్టీని వీడే విషయమై వారి సలహాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తీవ్ర మనస్తాపంలో ఉన్నందునే పార్టీ మారాలనుకుంటున్నానని స్పష్టం చేసినట్టు సమాచారం. నేడు, రేపో ఆయన పార్టీ వీడే అవకాశం ఉందని తెలుస్తోంది.