‘కామసూత్ర’: ‘కామసూత్ర’ నృత్యరూపకం ఓ సాహసం: స్వాతి సోమనాథ్
- ఈ నృత్యరూపకం అప్పటికి నాకు పెళ్లి కాలేదు
- ఎం.ఫిల్ చేస్తుండగా ‘కామసూత్ర’ చేయాలనే ఆలోచన వచ్చింది
- ఓ ఇంటర్వ్యూలో స్వాతిసోమనాథ్
‘కామసూత్ర’ నృత్య రూపకం చేయడం ఓ సాహసమంటూ ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి స్వాతి సోమనాథ్ నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. ‘తెలుగు పాపులర్ డాట్ కామ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘కామసూత్ర’ నృత్య రూపకం బహుశ 2003లో ప్రదర్శించా. అప్పటికి నాకు మంచి పేరు ఉంది.. మంచి డ్యాన్సర్ అని అనుకునేవారు.
‘కామసూత్ర’ ప్రదర్శించడం ఓ సాహసం. వాస్తవం చెప్పాలంటే, అది పెద్ద క్రియేటివ్ వర్క్ అని అనుకోను. ఇప్పటికి అప్పటికి మీడియా, సామాజిక మాధ్యమాల్లో చాలా తేడా ఉంది. అప్పుడు చాలా కంట్రోల్ గా ఉండేది. ఆ రోజుల్లో సోషల్ మీడియా అంతగా లేదు. కనుక, అప్పుడు, కామసూత్ర నృత్యరూపకం ప్రదర్శించడం నా జీవితంలోనే పెద్ద సాహసం. ఈ ప్రదర్శన ఆలోచన అనుకోకుండా వచ్చింది. హైదరాబాద్ లోని సీఫెల్/ఇఫ్లూ నుంచి ఎం.ఫిల్ ఇంగ్లీషు లిటరేచర్ చేశాను. ఎం.ఫిల్ లో ఇండియన్ ఫిలాసఫీలో నా లాస్ట్ టాపిక్ .. సెక్స్ వాలిటి టూ స్పిరిట్యువాలిటి (శృంగార టూ మోక్ష). ఇందుకోసం నేను ‘కామసూత్ర’ చదివాను. దీనిని ఎందుకు నృత్యరూపకంగా చేయకూడదనే ఆలోచన నాకు అప్పుడొచ్చింది’ అని అన్నారు.
‘ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు దగ్గర ఈ విషయం ప్రస్తావిస్తే..నోరు తెరిచారు! ఈ నృత్యరూపకం గురించి ఇంట్లో చెప్పలేదు.. మా అమ్మతో, మా సోదరుడితో అసలు చెప్పలేదు. అప్పటికీ నాకు ఇంకా పెళ్లి కాలేదు.. బహుశ ముప్పై ముప్పైరెండేళ్లుంటాయి నాకు. ఎవరినో స్ఫూర్తిగా తీసుకుని నేను ‘కామసూత్ర’ నృత్యరూపకం చేయలేదు. ఆ నృత్యరూపకం చెయ్యాలనిపించింది.. చేశాను. ‘కామసూత్ర’ను నృత్యరూపకంగా మలచాలనుకున్నప్పుడు రెండు సమస్యలు వచ్చాయి. ఒకటి.. లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ప్రేక్షకులు ఏ విధంగా స్పందిస్తారు? రెండోది.. నృత్యరూపకంలో బిగినింగ్, మిడిల్, ఎండింగ్ ఎలా ఉండాలి? అనేది నిర్ణయించుకోవడం కష్టమైంది. ‘కామసూత్ర’ స్పిరిట్యువల్ కాదు..పక్కా సైన్స్’ అని ఆమె చెప్పుకొచ్చారు.