పరుచూరి గోపాలకృష్ణ: శ్రీరాముడిలో ఉన్న గుణాలన్నీ అమరేంద్ర బాహుబలిలో కనిపిస్తాయి: పరుచూరి గోపాలకృష్ణ
- శ్రీరామచంద్రుడి పాత్రే ఇన్స్ పిరేషన్
- అమరేంద్ర బాహుబలి పాత్ర కోసమే ప్రభాస్ పుట్టాడా! అన్నంత బాగా నటించాడు
- ‘పరుచూరి పాఠాలు’లో గోపాలకృష్ణ
శ్రీరాముడిలో ఉన్న గుణాలన్నీ అమరేంద్ర బాహుబలి పాత్రలో కనిపిస్తాయని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ‘పరుచూరి పాఠాలు’లో భాగంగా ‘బాహుబలి’లోని అమరేంద్ర బాహుబలి పాత్ర గురించి విశ్లేషించారు.
‘అమరేంద్ర బాహుబలిని కట్టప్ప చంపే సీన్ లో ప్రభాస్ అద్భుతంగా నటించాడు. కొన్ని పాత్రల కోసం కొంత మంది పుడతారంటారే! అలా!, అమరేంద్ర బాహుబలి పాత్ర పోషించేందుకే ప్రభాస్ పుట్టాడా! అన్నంత బాగా నటించాడు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర రూపకల్పనకు శ్రీరామచంద్రుడి పాత్రే ఇన్స్ పిరేషన్ అని నా విశ్వాసం. ఎందుకంటే, శ్రీరాముడిలో ఉన్న గుణాలు ధీరోదాత్తత, శీలత్వం, స్వచ్ఛత.. ఇవన్నీ కూడా ఈ పాత్రలో కనిపిస్తాయి.
అంతేకాకుండా, తల్లి కాని తల్లి తన పినతల్లి కైక మాట విని శ్రీరాముడు రాజ్యం వదిలేశాడు. ఈ సినిమాలో కూడా తల్లి కాని తల్లి శివగామి మాట విని, దేవసేన కోసం అమరేంద్ర బాహుబలి రాజ్యం వదిలేశాడు. కనుక, ఈ చిత్రంలోని అన్నింటిని గమనిస్తే, ’ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి పాత్రకు, శివగామి పాత్రకు మీకు ఇన్స్ పిరేషన్ ఎవరు?’ అని కనుక విజయేంద్ర ప్రసాద్ గారిని అడిగితే ‘శ్రీరామచంద్రుడు, కైక’ అని ఆయన చెప్పి తీరతారు’ అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.