రేవంత్ రెడ్డి: రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కి పూర్తిగా చంద్రబాబే బాధ్యుడనిపిస్తోంది: సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని

  • చంద్రబాబు ధోరణిలో దూకుడుగా వెళితే ఉపయోగమని రేవంత్ అనుకున్నాడు
  • అందుకే రెచ్చిపోయి కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశాడు
  • టీఆర్ఎస్ పై వ్యతిరేకత, కాంగ్రెస్ పై అభిమానం రేవంత్ కు ఉంటాయని అనుకోవడం లేదు
  • ఓ ఇంటర్వ్యూలో కొమ్మినేని

టీటీడీపీకి ఇటీవలే గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘తెలుగు పాప్యులర్ డాట్ కామ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కు పూర్తిగా చంద్రబాబే బాధ్యుడని నాకు అనిపిస్తోంది. రాష్ట్ర పునర్విభజన తర్వాత కేసీఆర్ ఏం చేసినా టీడీపీ ఎద్దేవా చేసింది..విమర్శించింది.

ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి కూడా రెచ్చిపోయి.. చంద్రబాబు ధోరణిలో మనం కూడా బాగా దూకుడుగా వెళితే ఉపయోగమని అనుకున్నాడు. అతనికి వాగ్ధాటితో పాటు పంచ్ డైలాగ్స్ కూడా పేల్చే అలవాటు ఉంది. ఏమాటకు ఆ మాట ఒప్పుకోవాలి.. రేవంత్ చిచ్చరపిడుగులా వ్యవహరించాడు. టీఆర్ఎస్ పై వ్యతిరేకత, కాంగ్రెస్ పై అభిమానం రేవంత్ కు ఉంటాయని నేను అనుకోవడం లేదు.

చంద్రబాబుని విశ్వసించిన రేవంత్ రెడ్డి మనం దూకుడుగా వెళితే హీరో అవుతామనే నమ్మకంతో కేసీఆర్ పై ధాటిగా వ్యాఖ్యలు చేశాడు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ తర్వాత రేవంత్ మరింత దూకుడుగా వ్యవహరించాడు. దానికితోడు చంద్రబాబు అండ గట్టిగా దొరికింది. ఇలాంటి కేసుల్లో ఎవరైనా దొరికితే చంద్రబాబు ఏమనేవారు, ‘ఇలాంటి వాటిని క్షమించను, సస్పెన్షన్.. అదీ ఇదీ’ అనేవారు. కానీ, రేవంత్ విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే, ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుపై కూడా ఆరోపణలు వచ్చాయి కదా?’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News