జీహెచ్ఎంసీ: అక్రమ కట్టడాల కూల్చివేతను వేగవంతం చేయాలి: జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ ఆదేశాలు
- నాలాలపై ఆక్రమణల కూల్చివేతపై సమీక్ష
- ఇప్పటివరకు 93 అక్రమ నిర్మాణాల తొలగింపు
- సమీక్షలో పాల్గొన్న జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్
గ్రేటర్ హైదరాబాద్ లోని అక్రమ కట్టడాల కూల్చివేతను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని నాలాలపై ఆక్రమణల కూల్చివేత అంశంపై ఈరోజు సమీక్షించారు. ఈ సమీక్షకు టౌన్ ప్లానింగ్, ప్రాజెక్టు విభాగం ఇంజనీర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లు హాజరయ్యారు.
హైదరాబాద్ లోని నాలాలపై అడ్డంకిగా మారిన 844 అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. గత నెల నుంచి కొనసాగుతున్న అక్రమనిర్మాణాల తొలగింపులో భాగంగా ఇప్పటివరకు 93 అక్రమ నిర్మాణాలను తొలగించినట్టు చెప్పారు. అక్రమ నిర్మాణదారులకు విధిగా ముందస్తు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.
కాగా, నాలాల విస్తరణ సందర్భంగా ఇళ్లు కోల్పోతున్న నిరుపేదలకు ఉచితంగా ఇళ్లు కేటాయించడానికి, నగరంలో జేఎన్ఎన్ యూఆర్ఎం, వాంబే పథకాల నిమిత్తం నిర్మించిన రెండు వేల ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.