మాదక ద్రవ్యాలు: మాదక ద్రవ్యాలు స్వాధీనం.. బంజారాహిల్స్ లో నివసిస్తున్న మహ్మద్ ఫరాజ్ అరెస్టు!

  • సింకోని ఫైనాన్షియల్ బ్యాంక్ లో పని చేస్తున్న నిందితుడు
  • మాదక ద్రవ్యం మనీల క్రీమ్ ను సిగిరెట్లలో నింపుకుని వాడకం
  • అతని నుంచి 14 గ్రాముల మనీల క్రీమ్ స్వాధీనం

హైదరాబాద్ లో మరోమారు డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. మాదక ద్రవ్యం మనీల క్రీమ్ ను సిగిరెట్లలో నింపుకుని వాడుతున్న మహ్మద్ ఫరాజ్ అలీని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అబ్కారీ శాఖ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ చల్లా వివేకానందరెడ్డి, ఎన్ ఫోర్స్ మెంట్ ఏఈఎస్ పవన్ కుమార్ మాట్లాడుతూ, గచ్చిబౌలిలోని సింకోని ఫైనాన్షియల్ బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక అధికారిగా మహ్మద్ ఫరాజ్ అలీ పని చేస్తుంటాడని, బంజారాహిల్స్ రోడ్ నెం.4 లో ఆయన నివసిస్తున్నాడని చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ వెళ్లిన సందర్భంలో అక్కడ కసోలా అనే గ్రామం నుంచి మనీల క్రీమ్ ను తీసుకొచ్చినట్టు తమ విచారణలో వెల్లడైనట్టు చెప్పారు. సిగిరెట్లలో దీనిని నింపుకుని వాడుతున్నట్టు గుర్తించామని, ఈ మాదక ద్రవ్యాన్ని తన సహచరులకు మహ్మద్ ఫరాజ్ సరఫరా చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని చెప్పారు. ఇంకా ఎవరెవరికి ఈ మాదక ద్రవ్యాన్ని సరఫరా చేస్తున్నాడనే విషయమై ఆరా తీస్తున్నామని, నిందితుడి నుంచి 14 గ్రాముల మనీల క్రీమ్ ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News