: ఎస్వీఆర్, భానుమతి, అల్లు పై స్టాంపులు విడుదల చేసిన కేంద్రం
భారతీయ సినిమా వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ నటులు ఎస్వీ రంగారావు, భానుమతి, అల్లు రామలింగయ్యల సేవలను గుర్తిస్తూ కేంద్రం స్టాంపులను విడుదల చేసింది. నేడు హైదరాబాద్ ఫిలిం చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాంబర్ అధ్యక్షుడు సి. కల్యాణ్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కల్యాణ్ మాట్లాడుతూ, ఈనెల 3న కేంద్రం భారతీయ సినిమాకు వన్నెలద్దిన పలువురి పేరిట ఈ ప్రత్యేక స్టాంపులను విడుదల చేసిందని చెప్పారు.
తాము తెలుగు చిత్రసీమ నుంచి సాలూరి రాజేశ్వరరావు, రఘుపతి వెంకయ్యల పేర్లను కూడా కేంద్రానికి ప్రతిపాదించామని కల్యాణ్ వెల్లడించారు. జూన్ లో ఎస్వీఆర్, భానుమతి, అల్లు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ స్టాంపులను ఆవిష్కరిస్తామని తెలిపారు.