జగన్: పాప పరిహారం కోసమే జగన్ పాదయాత్ర: టీడీపీ నేతలు
- పాలక, ప్రతిపక్షాల పాత్రలను టీడీపీయే పోషిస్తోంది
- టీడీపీ పాలనను ప్రజలు హర్షిస్తుంటే జగన్ పాదయాత్ర ఎందుకు?
- ప్రతిపక్ష నేత జగన్ పై మండిపడ్డ అచ్చెన్నాయుడు, జవహర్, పయ్యావుల
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రులు జవహర్, అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, పాప పరిహారం కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ప్రతిపక్షనేతగా జగన్ విఫలమయ్యారని అన్నారు. పాలక, ప్రతిపక్ష పాత్రలను టీడీపీనే పోషిస్తోందని, టీడీపీ పాలనను ప్రజలు హర్షిస్తుంటే జగన్ పాదయాత్ర చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో జగన్ గడపగడపకూ వెళ్లినప్పటికీ 16 శాతం ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపోయిందని విమర్శించారు.
టీడీపీకి చెందిన మరో నేత పయ్యావుల కేశవ్ స్పందిస్తూ, అసెంబ్లీలో జగన్ లేకుంటే ఆ పార్టీకి చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు ఎక్కడ గుర్తింపు తెచ్చేసుకుంటారోనన్న అభద్రతాభావంతోనే ఆ సమావేశాలను ఆయన బహిష్కరించేందుకు సిద్ధపడ్డారని అన్నారు.