విశాల్ : సినీ హీరో విశాల్‌కు మరిన్ని కష్టాలు.. ఆదాయపు పన్ను శాఖ నుంచి సమన్లు
- విశాల్ కార్యాలయాలపై జీఎస్టీ అధికారుల దాడులు
- రూ. 51 లక్షల పన్ను చెల్లించలేదని తెలుసుకున్న అధికారులు
- ఈ నెల 27వ తేదీన తమ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశం
ఇటీవల విడుదలైన మెర్శల్ చిత్రంలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు ఉండడంతో దానిపై వివాదం చెలరేగుతోన్న విషయం తెలిసిందే. తమిళ నటుడు విశాల్ ఆ సినిమాకు మద్దతు తెలపడంతో పాటు ఆ సినిమాని ఇంటర్నెట్‌లో చూసిన బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజాను తప్పుపట్టారు. ఈ క్రమంలో, విశాల్ కార్యాలయాలపై జీఎస్టీ అధికారులు దాడులు చేయడం అలజడి రేపుతోంది. నటుడు విశాల్ దీనిపై స్పందించి తన ఆదాయానికి సంబంధించిన లెక్కలన్నీ సరిగానే ఉన్నాయని చెప్పుకున్నప్పటికీ, ఆ తనిఖీల ద్వారా ఆయన రూ. 51 లక్షల పన్ను చెల్లించలేదని అధికారులకు తెలిసినట్టు సమాచారం.
దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విశాల్‌కి సమన్లు జారీచేశారు. ఈ నెల 27వ తేదీన తమ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. ఈ క్రమంలో విశాల్ కార్యాలయం నుంచి కొన్ని కీలక ఆధారాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకే విశాల్ కార్యాలయంలో దాడులు జరిపారని విమర్శలు వస్తున్నాయి.