Thumri queen: దిగ్గజ గాయకురాలు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత గిరిజాదేవి కన్నుమూత
- కార్డియాక్ అరెస్ట్‌తో ఆసుపత్రిలో చేరిక
- పరిస్థితి విషమించడంతో మృతి
- ప్రగాఢ సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
ప్రముఖ క్లాసికల్ సింగర్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత గిరిజాదేవి (88) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. థుమ్రి క్వీన్‌గా పరిగణించే ఆమెను అభిమానులు అప్పాజీగా పిలుస్తారు. గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆమెను మంగళవారం మధ్యాహ్నం నగరంలోని బీఎం బిర్లా హార్ట్ రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉందని, రాత్రి 8.45 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు.
గిరిజాదేవి మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. ఆమె పాటలు జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. బనారస్ సమీపంలోని ఓ చిన్న పల్లెటూరులో జమీందారు కుటుంబంలో పుట్టిన గిరిజాదేవి సంగీతాన్ని తన జీవితంగా మార్చుకున్నారు. లెజెండరీ సింగర్‌గా ఎదిగారు. 1972లో పద్మశ్రీ, 1989లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.