టీఆర్ఎస్: టీఆర్ఎస్ లో చేరిన కొడంగల్ నియోజకవర్గ టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు
- మంత్రులు మహమూద్ అలీ, మహేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన రెండు పార్టీల కార్యకర్తలు
- రేవంత్ పై విమర్శలు గుప్పించిన మహేందర్ రెడ్డి
- కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ ఒరగబెట్టిందేమిటని ప్రశ్నించిన నేత
మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలోని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొడంగల్, దౌల్తాబాద్ మండలాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు 700 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో ఈరోజు చేరారు. తెలంగాణ భవన్ లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో ఆయా పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, టీటీడీపీ నేత, కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.