షబ్బీర్ అలీ: సీబీఐ మాజీ డైరెక్టర్ల అవినీతి కేసులో.. ఈడీ చార్జిషీట్ లో షబ్బీర్ అలీ పేరు!
- సీబీఐ మాజీ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజిత్ సిన్హా అవినీతి కేసు
- హవాలా డీలర్ ఖురేషికి షబ్బీర్ అలీ లంచాలు ఇచ్చినట్టు ఈడీ చార్జిషీట్ లో నమోదు
- ఈ వ్యవహారంపై స్పందించిన షబ్బీర్ అలీ
- అసలు, ఖురేషీ ఎవరో నాకు తెలియదు.. నాకు ఎటువంటి నోటీసులు రాలేదు
సీబీఐ మాజీ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజిత్ సిన్హాల ప్రమేయం వున్న అవినీతి కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ పేరు తెరపైకి వచ్చింది. ఈడీ చార్జిషీట్ లో షబ్బీర్ అలీ పేరు నమోదు చేసింది. రంజిత్ సిన్హా కోసం హవాలా డీలర్ మొయిన్ ఖురేషి నాడు లంచాలు వసూలు చేశాడు. ఖురేషికి షబ్బీర్ అలీ లంచం ఇచ్చి తన పనులు చేయించుకున్నాడని ఈడీ తన చార్జిషీట్ లో పేర్కొన్నట్టు సమాచారం.
కాగా, దీనిపై షబ్బీర్ అలీ స్పందిస్తూ, అసలు, మొయిన్ ఖురేషి ఎవరో తనకు తెలియదని అన్నారు. ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, ఆ నోటీసులు వచ్చాక మాట్లాడతానని, ఈడీ పిలిస్తే వెళ్తానని, విచారణకు సహకరిస్తానని పాత్రికేయులతో చెప్పారు.