లెక్చరర్లు : పిల్లలు చదవకపోతే లెక్చరర్లు కొట్టకుండా ఎలా ఉంటారు?: విద్యార్థులను చితక్కొట్టిన ఘటనపై తల్లిదండ్రుల ట్విస్ట్
- కృష్ణా జిల్లా నందిగామలోని దీక్ష కళాశాలలో విద్యార్థులను చితక్కొట్టిన లెక్చరర్
- ఆ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఊహించని ట్విస్ట్
- ఆ కాలేజీని మూసేస్తే ఇప్పుడు తమ పిల్లలు ఎక్కడ చదువుకుంటారని ఆగ్రహం
కృష్ణా జిల్లా నందిగామలోని దీక్ష కళాశాలలో ఓ లెక్చరర్ తమ విద్యార్థులను వరుసగా నిలబెట్టి చితక్కొట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. హోం వర్క్ చేయలేదనే కారణంతో శ్రీనివాస్ అనే లెక్చరర్ ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ లక్ష్మీకాంతం ఆ కాలేజీకి వెళ్లి విచారణ జరిపి, ఆ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
అయితే, దీనిపై ఆ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. పిల్లలు చదవకపోతే లెక్చరర్లు కొట్టకుండా ఎలా ఉంటారని తల్లిదండ్రులు మీడియాను ప్రశ్నించారు. మీడియాలో వస్తోన్న వార్తలను చూసి ఆ కాలేజీని మూసేస్తే ఇప్పుడు తమ పిల్లలు ఎక్కడ చదువుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి మీడియా వెళ్లి పోవాలని డిమాండ్ చేశారు.