చైనా : చైనా వృద్ధిరేటు 6 శాతం వద్దే నిలిచిపోతే.. భారత్ 8 శాతం నమోదు చేస్తోంది: వివరించి చెప్పిన కేంద్ర ప్రభుత్వం
- దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతోందని విపక్ష పార్టీల విమర్శలు
- సమాధానం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- ఈ మూడేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ, వృద్ధిరేటు బాగానే ఉంది
- గత మూడేళ్లుగా జీడీపీ సగటు 7.5 శాతంగా ఉంది
ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతోందని విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. అంతేగాక, సొంత పార్టీ నేతలు కూడా ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నింటికీ సమాధానం చెబుతూ దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ... మనదేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు బాగానే ఉన్నాయని అన్నారు. ఈ మూడేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ, వృద్ధిరేటు బాగానే ఉందని చెప్పారు.
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని జైట్లీ చెప్పారు. ఆర్థిక సంస్కరణల ఫలితాలు అందరికీ అందుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. విదేశీ మారకం నిల్వలు 400 బిలియన్ డాలర్లు దాటాయని అన్నారు. గత మూడేళ్లుగా భారత్ ఆర్థికాభివృద్ధిలో పరుగులు తీస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు మాట్లాడుతూ చైనా వృద్ధిరేటు 6 శాతం వద్దే నిలిచిపోతే.. భారత్ 8 శాతం నమోదు చేస్తోందని అన్నారు. గత మూడేళ్లుగా జీడీపీ సగటు 7.5 శాతంగా ఉందని వివరించారు. నోట్లరద్దు, జీఎస్టీ అమలు అతిపెద్ద ఆర్థిక సంస్కరణలని అన్నారు.