పాకిస్థాన్ ప్రధాని: దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాకిస్థాన్ ప్రధాని
- ప్రజల్లో మత సామరస్యం మరింత పెరగాల్సిన అవసరం ఉంది
- అన్ని మతాలు శాంతి సామరస్యాలతోనే ఉండాలని చెబుతాయి
- మైనారిటీల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
దీపావళి పర్వాదినాన తమ దేశంలోని హిందువులను ఉద్దేశించి మాట్లాడిన పాకిస్థాన్ ప్రధానమంత్రి షాహిద్ అబ్బాసి.. వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి వెలుగులు అందరి జీవితాల్లోనూ సుఖ సంతోషాలు నింపాలని తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రజల్లో మత సామరస్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. మతం హింసను నేర్పించబోదన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. నిజానికి అన్ని మతాలు శాంతి సామరస్యాలతోనే ఉండాలని చెబుతాయని అన్నారు.
మతాల్లో ఉన్న మంచి విలువని బోధించి, మానవతా దృక్పథాన్ని అందరిలోనూ పెంచాలని తాను మత బోధకులను కోరుతున్నానని వ్యాఖ్యానించారు. పాక్ అభివృద్ధికి తమ దేశంలోని హిందూ కమ్యూనిటీ సహకారం అందించాలని కోరారు. తమ దేశంలోని మైనారిటీల సంక్షేమానికి, వారి హక్కులను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెప్పారు.