చిరంజీవి: చిరంజీవిగారు ఆ మాట అనడంతో.. మా అన్నయ్య చేతిలో వున్న సిగరెట్టును విసిరి పారేశాడు!: పరుచూరి గోపాలకృష్ణ
- అన్నయ్య, నేను ఇద్దరం సిగరెట్లు కాల్చేవాళ్లం
- ఆ అలవాటు నుండి1986లో నేను బయటపడ్డా
- అన్నయ్య మాత్రం తాగేవాడు
- ‘ఆ కొడుకు కోసం ఈ సిగరెట్లు మీరు మానెయ్యలేరా? అని చిరంజీవి అన్నారు
ప్రముఖ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ కి సిగరెట్ తాగే అలవాటు గతంలో ఉండేది. అయితే, ఈ అలవాటు నుంచి 1986లో పరుచూరి గోపాలకృష్ణ బయటపడ్డారు. కానీ, అన్నయ్య వెంకటేశ్వరరావు మాత్రం ఆ అలవాటు నుంచి బయటపడలేకపోయారట. ఎట్టకేలకు, ఆ అలవాటు నుంచి వెంకటేశ్వరరావు బయట పడటానికి కారణం మెగాస్టార్ చిరంజీవేనని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
‘పరుచూరి పలుకులు’ వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘1989 వరకూ మా అన్నయ్యకు సిగరెట్ తాగే అలవాటు పోలేదు. ఓ రోజున మా అన్నయ్యతో చిరంజీవి ఏమన్నారంటే, ‘కొడుక్కి అలా అయింది. ఆ కొడుకు కోసం ఈ సిగరెట్లు మీరు మానెయ్యలేరా?’ అన్నారు. వెంటనే, తన చేతిలో ఉన్న సిగరెట్ ను మా అన్నయ్య విసిరి అవతల పారేశాడు. ఓ భయంకరమైన దురలవాటును ఆయన సలహా మేరకే మా అన్నయ్య మానేశాడు.
అందుకే, చెబుతారు! ‘నీకు సామ్రాజ్యాలు ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు .. మంచి సలహా ఇచ్చే మిత్రుడు పక్కన ఉంటే అంతకు మించిన వరం మరోటి లేదు’ అని. చిరంజీవిగారు మాకు ఎన్నో విషయాల్లో సలహాలు ఇచ్చినటువంటి మంచి మిత్రుడు, సన్నిహితుడు, మేము మెచ్చిన హీరో’ అని పరుచూరి చెప్పుకొచ్చారు.
కాగా, పరుచూరి వెంకటేశ్వరరావు కొడుకు పరుచూరి రఘుబాబు కేన్సర్ వ్యాధి బారిన పడి గతంలో మృతి చెందాడు. అతన్ని హీరో చేయాలని వారు అనుకున్నారు. కానీ, అది కార్యరూపం దాల్చకుండానే రఘుబాబు ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. పరుచూరి రఘుబాబు పేరిట ప్రతి ఏటా నాటకపోటీలను పరుచూరి బ్రదర్స్ నిర్వహిస్తున్నారు.